జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే అసెంబ్లీ, సెక్రటేరియట్, అరకొర కార్యాలయాలు మినహా దాదాపుగా ఇతర కార్యాలయాల నిర్మాణాలను జగన్ పూర్తి చేయలేదు. అమరావతి రాజధానిగా ఉండి ఉంటే అక్కడ తమ కేంద్ర కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్బీఐ, కాగ్ వంటి పలు కేంద్ర స్థాయి సంస్థలు ఏర్పడి ఉండేవి. ఆ సంస్థలన్నీ అమరావతి రాజధానిలో ఈ పాటికి తమ కార్యకలాపాలు ప్రారంభించి కూడా ఉండేవి.
కానీ, జగన్ పుణ్యమా అంటూ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగలడంతో కేంద్ర కార్యాలయాలు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ సంస్థలు అసలు ఏపీ జోలికి రావడం మానేశాయి. పలు ప్రతిష్టాత్మక సంస్థలు కూడా అమరావతిలో కేంద్రీయ కార్యాలయం లేక హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న వైనం ఏపీకే అవమానం. ఇక, తాజాగా చంద్రబాబుకు బెయిల్ రాకుండా ఉండేందుకు జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ సంస్థల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్కిల్ స్కీం కేసులో మొదటి 36 మంది నిందితులకు బెయిల్ ఇచ్చి 37వ వ్యక్తి అయిన చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంలో వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయంటే దానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడం వల్లే ఇన్ని కేంద్ర సంస్థలను ఏర్పాటు కాకుండా జగన్ చేశారని దుయ్యబడుతున్నారు.