ఇంతకాలం ఏమి పట్టించుకోకుండా సరిగ్గా ఎన్నికల ప్రక్రియ మొదలవ్వగానే దాడులు చేస్తే దాన్ని కక్ష సాధింపనే అంటారు ఎవరైనా. ఇపుడు ఐటి శాఖ ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొంటోంది. గురువారం ఉదయం నుండి ఐటి శాఖ అధికారుల బృందాలు ఖమ్మం జిల్లాలో పాలేరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆఫీసులపై దాడులు మొదలుపెట్టింది. పొంగులేటి ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. మొన్ననే కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంఎల్ఏగా పోటీచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఇళ్ళు ఆఫీసుపై దాడులు జరిగాయి.
అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్ధులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పారిజాత నర్పింహారెడ్డి ఇళ్ళు, ఆఫీసులపైన కూడా ఐటి శాఖ దాడులుచేసింది. ఈ దాడులన్నీ కూడా ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత, నామినేషన్లు వేయబోయే సమయంలోనే జరగటం గమనార్హం. తుమ్మల, పొంగులేటి, కిచ్చెన్నగారి, పారిజత, జానారెడ్డి లక్ష్యంగానే ఐటిశాఖ ఎందుకు దాడులు చేసినట్లు ? ఇంకెంతమందిని లక్ష్యంగా చేసుకుంది ? అనే ప్రశ్నలు సహజంగానే మొదలవుతున్నాయి.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తుమ్మల, పొంగులేటిని బీజేపీలో చేర్చుకోవాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎన్ని ప్రయత్నాలు జరిగినా వీళ్ళు బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరారు. ఆ కోపంతోనే వీళ్ళపైన కేంద్రప్రభుత్వం ఐటిశాఖ ద్వారా దాడులు చేయిస్తున్నట్లు ఆరోపణలు మొదలైపోయాయి. నిజానికి ఐటి శాఖ ఎవరినీ అరెస్టుచేసే అవకాశాలు లేవు. కట్టిన పన్నుల్లో తేడాలుంటే, లేదా పన్నులు ఎగ్గొట్టినట్లు నిరూపణైతే పెనాల్టి విధిచగలదంతే. ఇంతోటి దానికి నామినేషన్లు వేసే సమయంలో దాడులు చేయటం ఏమిటో అర్ధంకావటంలేదు.
అదికూడా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులను వదిలేసి అచ్చంగా కాంగ్రెస్ నేతలపైన మాత్రమే దాడులు జరుగుతున్నాయి. దీన్నే కాంగ్రెస్ నేతలు కక్షసాధింపులని అంటున్నారు. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అన్నీ పార్టీల్లోను ఉన్నారు. ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చలు పెట్టగలిగిన కెపాసిటి ఉన్నఅభ్యర్ధులు చాలామందున్నారు. వాళ్ళందరినీ వదిలేసి కేవలం హస్తంపార్టీ నేతలనే ఐటిశాఖ ఎందుకు టార్గెట్ చేస్తోంది ? అందుకనే కక్షసాధింపులని గోల పెరిగిపోతోంది.