ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రపంచ శాంతి దూతగా చెప్పుకొనే కిలారి ఆనంద పాల్ తెలంగాణ ఎన్నికల్లో పోటీకి రెడీ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన 12 మంది అభ్యర్తులతో కూడిన తొలి జాబితాను ప్రకటించారు. వాస్తవానికి 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు తన పార్టీలో నాయకులు పోటీ పడుతున్నారని, అయితే, వారి అభ్యర్థిత్వాలు, సమర్థత, ప్రజల్లో వారికి ఉన్న సానుకూలత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్టు పాల్ చెప్పారు.
చెన్నూరు – మొయ్య రాంబాబు, జుక్కల్ (ఎస్సీ)-కర్రోల్ల మోహన్, రామగుండం- బంగారు కనకరాజు, వేములవాడ- అజ్మీరా రమేశ్‌బాబు, నర్సాపురం – సిరిపురం బాబు, జహీరాబాద్ – బేగరి దశరథ్, గజ్వేల్ – పాండు, ఉప్పల్ – కందూరు అనిల్ కుమార్, యాకుత్‌పురా – సిల్లివేరు నరేశ్, కల్వకుర్తి – కట్టా జంగయ్య, నకిరేకల్ – కదిర కిరణ్‌కుమార్, మధిర – కొప్పుల శ్రీనివాస్ రావు పోటీ చేయనున్నట్టు పాల్ ప్రకటించారు. వీరంతా సమర్థులని.. అందుకే ఆయా స్థానాల్లో ఎంతో మంది పోటీకి రెడీ అయినావీరిని మాత్రమే ఎంపిక చేసినట్టు పాల్ వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారని తెలిపారు. అన్ని వర్గాలకు తన పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మంగళవారం రెండో జాబితా విడుదల చేస్తామని అన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేసేదీ త్వరలోనే వెల్లడిస్తానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీలు అన్నీ ఒకే పార్టీలని పాల్ విమర్శించారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.