తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్న పార్టీ ఒకవైపు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. మూడోసారి కూడా విజయం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న పార్టీ మరోవైపు. ఇంకోవైపు.. స్థానిక పార్టీలు, సెంటిమెంటు పార్టీలు, ప్రజలను తమవైపు తిప్పుకోవాలనుకునే నాయకులు. ఇక, అధికారం అంటూ.. నిన్న మొన్నటి వరకు ప్రయత్నాలు చేసిన మరోపార్టీ కనీసం గౌరవప్రదమైన స్థానాలనైనా దక్కించుకోవాలని చేస్తున్న ప్రయత్నం మరోవైపు.
వెరసి తెలంగాణ ఎన్నికల్లో మూడు కీలక పార్టీల అడుగులువేగంగా పడుతున్నాయి. వీటిలో అధికార పార్టీ బీఆర్ ఎస్ దూకుడు ఒకవిధంగా ఉంటే.. ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మరో విధంగా పరుగులు పెడుతోంది. ఇతర పార్టీలను కూడా కలుపుకొని.. నాయకులను చెంతకు చేర్చుకుని.. వచ్చే ఎన్నికల్లో విజయానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక, బీజేపీ కూడా అగ్రనేతల రాకపోకలు.. మేనిఫెస్టోల రూపకల్పన, కొత్తవారికి అవకాశాలు.. అంటూ.. హడావుడి చేస్తోంది.
ఇలా.. ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ఉంటే.. ప్రజానాడి మాత్రం దీనికి భిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోం ది. ఏ ఒక్క పార్టీకీ గుండుగుత్తగా ప్రజలు మద్దతు తెలపడం లేదు. అన్ని పార్టీలనూ డిఫెన్సులో పెట్టారు టీ ప్రజలు. ఇప్పటి వరకు అనేక సర్వేలు జరిగాయి. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. జాతీయ, స్థానిక సర్వే సంస్థలు రంగంలోకి దిగి ప్రజానాడిని పట్టుకునే ప్రయత్నాలు చేశాయి. దీనిలో ఎక్కడా కూడా.. ప్రజలు ఏకపక్షంగా తమ మద్దతు ఏ పార్టీకీ ఇవ్వలేదు.
తెలంగాణ కోసం ఉద్యమాలు నిర్మించి.. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని కేసీఆర్ ను మరో సారి ప్రొజెక్టు చేస్తున్న పదేళ్ల అధికార పార్టీ బీఆర్ ఎస్ వైపు కానీ, తెలంగాణ ఇచ్చింది తామేనని.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. అభ్యర్థిస్తూ.. సానుభూతి పవనాలు వీస్తున్న కాంగ్రెస్‌కు కానీ.. ప్రజలు గుండుగుత్తగా మద్దతు తెలపడం లేదు. ఇక, అభివృద్ధి క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటున్న బీజేపీ వైపు కూడా ప్రజలు ఏకపక్షంగా నిలబడడం లేదు.
ఈ మూడు పార్టీలకూ.. ప్రజలు ముచ్చెమటలు పట్టించేలా.. సర్వే ఫలితాలు ఉండడంతో ప్రతి పార్టీ కూడా.. ప్రయాస పడక తప్పని పరిస్థితి ఏర్పడిందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ బీఆర్ ఎస్ కు 50-60 మధ్య, కాంగ్రెస్‌కు 45-55 మధ్య, బీజేపీకి 5-10 సీట్ల మధ్య మాత్రమే ఆధిక్యత వస్తుందని సర్వేలు తేల్చి చెప్పాయి. అంటే.. దీనిని బట్టి తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏ పార్టీకైనా గుండుగుత్తగా అధికారం ఇవ్వాలనే ఆలోచన టీ ప్రజలకు లేదనే విషయం కూడా తేటతెల్లమవుతోంది. మొత్తానికి టీ ఓటరు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.