సీఎం జగన్ పాలనలో అవినీతి జరిగిందంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టు తలుపుతట్టారు. జగన్ పై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ…జగన్ పాలనలో అవినీతిపై సీబీఐ విచారణ జరపాలంటూ హైకోర్టు లో పిల్ దాఖలు చేశారు. జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందని తెలుపుతూ పిటిషన్ వేశారు. కొందరు ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా పిటిషన్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 1,311 పేజీలతో రఘురామ న్యాయవాది ఉన్నం మురళీధర్ పిటిషన్ దాఖలు చేశారు.
మద్యం, ఇసుక, అంబులెన్స్ ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని, పోర్టులను అనుచరులకు కట్టబెట్టారని ఆరోపించారు. పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా ప్రైవేటు వ్యక్తుల స్థలాలను కొని భారీ అవినీతికి తెరతీశారని వెల్లడించారు. ఎక్సైజ్ పాలసీని మార్చి భారీ ఎత్తున మద్యం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భారతీ సిమెంట్స్ కు కూడా లబ్ది కలిగేలా వ్యవహరించారని ఆరోపించారు. సీఎం, మంత్రివర్గం, కొందరు అధికారులు, పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డిలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆ పిల్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు నంబర్ కేటాయించింది.