సీఎం జగన్ పాలనలో తిరుమల కొండపై అన్యమత ప్రచారం ఎక్కువైపోయిందని హిందువులు, పలు హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుమల కొండపై యథేచ్ఛగా క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని, క్రైస్తవ మతానికి చెందిన గుర్తులతో కూడిన వాహనాలు కూడా అడ్డు అదుపు లేకుండా కొండపైకి వెళుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను జగన్ మసకబారుస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఆ ఆరోపణలకు, విమర్శలకు తగ్గట్టుగా తాజాగా మంత్రి రోజా వివాదంలో చిక్కుకున్నారు. అన్యమత గుర్తు ఉన్న గొలుసును ధరించిన రోజా వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ తిరుమల కొండపైకి రావడం వివాదానికి దారితీసింది. ఈరోజు వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు. రోజా వెంట ఆమె వ్యక్తిగత ఫోటోగ్రాఫర్స్ స్టెయిన్ కూడా వచ్చారు. అయితే, స్టెయిన్ మెడలో అన్నమత గుర్తు ఉన్న చైన్ ఉండటం వివాదాస్పదమైంది. తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం దగ్గర స్టెయిన్ ను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు.
వాస్తవానికి అలిపిరి టోల్గేట్ వద్ద భక్తులను తనిఖీ చేసి అన్యమత గుర్తులుంటే వాటిని తీసివేస్తారు. కానీ, స్టెయిన్ మాత్రం ఆ గుర్తుతో ఉన్న చైన్ ధరించి కొండపైకి రావడం ఏమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా రోజా పలుమార్లు తిరుమల వచ్చారని, ఈ లెక్కన స్టెయిన్ కూడా అన్యమత గుర్తున్న చెయిన్ ధరించి పలుమార్లు ఆలయంలోకి వచ్చి ఉంటారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల తిరుమల పవిత్రతకు భంగం కలుగుతుందని భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే తిరుమల కొండపై అన్యమత ప్రచారం అడ్డు అదుపు లేకుండా సాగుతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం పై రోజా స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.