త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నారైలకు బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని బీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ఎన్నారైలంతా కలిసి రావాలని కోరారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్తో కదం తొక్కి తెలంగాణ సాధించుకున్న ఎన్నారైలు తెలంగాణ నిర్మాణంలో కూడా అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో కేసీఆర్ వెంట నడిచారని కేటీఆర్ అన్నారు. అదే మాదిరిగా ఈ కీలక సందర్భంలోనూ మరింత చురుగ్గా పనిచేయాలని బీఆర్ఎస్ ఎన్నారైలను కేటీఆర్ కోరారు.
ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో తీసుకెళుతున్నారని, మరోసారి తెలంగాణకు ఆయన అవసరమనే విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించి విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలకు గ్రామాల్లో గొప్ప గౌరవం ఉందని, వారంతా తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే నాయకత్వానికి ఎన్నికలలో ఓటు వేయాలని కోరితే ఓటర్లు వింటారని అన్నారు. రాబోయే 30 రోజులు తెలంగాణకు అత్యంత కీలకమని, కాంగ్రెస్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ 60 సంవత్సరాలపాటు అనేక బాధలకు గురైందని గుర్తు చేశారు. మరోసారి దారితప్పి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ అభివృద్ధి 50 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. తమ తమ సామాజిక మాధ్యమాల ద్వారా గత తెలంగాణ కష్టాలను, ప్రస్తుతం తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ వీడియోలు, పోస్టుల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.