జగన్ పాలనలో ఏపీలో శాంతియుతంగా నిరసనలు తెలపడం కూడా నేరం అయిపోయిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. నిరసన చేపట్టే అవకాశముందని తెలిసిన వెంటనే ముందస్తు అరెస్టులు..హౌస్ అరెస్టులు అంటూ పోలీసులు ఎక్కడికక్కడ నేతలను బంధించడం పరిపాటిగా మారింది. ప్రతిపక్ష నేతలనే కాదు..ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖ పోలీసులు పదేపదే హౌస్ అరెస్టు చేయడం, చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాదు, పదే పదే సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇస్తున్నారు.
దీంతో, గంటా శ్రీనివాసరావు ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు హైకోర్టు షాకిచ్చింది. మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని విశాఖ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తనకు సెప్టెంబర్లో ఇచ్చిన ఐదు నోటీసులను రద్దు చేయాలని కోర్టును గంటా కోరగా…విచారణ జరిపిన న్యాయస్థానం గంటాకు ఊరటనిచ్చింది. టీడీపీ నేతలను తరచూ గృహనిర్బంధం చేస్తూ, కార్యక్రమాలను అడ్డుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
గృహనిర్బంధం ఎందుకని అడిగినా పోలీసులు కారణాలు చెప్పట్లేదని గంటా తరఫు లాయర్లు వాదించారు. శాంతియుతంగా బహిరంగ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు అని, దానిని పోలీసులు కాలరాస్తున్నారని వాదనలు వినిపించారు. పిటిషనర్ కదలికలను అడ్డుకుంటూ ఆయన గొంతు నొక్కుతున్నారని, సీఆర్పీసీ సెక్షన్ 151ను ఉపయోగించి పిటిషనర్ కదలికలను అడ్డుకోవడానికి వీలులేదని వాదించారు. దీంతో, పిటిషనర్ స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించుకునే విషయంలో అడ్డంకులు సృష్టించవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.