ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్ర బాబుకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. శుక్రవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ఈ రోజు ముగిశాయి. దీంతో, తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారానికి రిజర్వ్ చేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు లాయర్లు సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే….ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీల మధ్య వాడీవేడీ వాదనలు జరిగాయి.
సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్నదానిపైనే ప్రధానంగా ఈ రోజు విచారణ జరిగింది. 482 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ రద్దు కుదరదని రోహత్గీ వాదించగా…అసలు చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని సాల్వే, లూథ్రా వాదించారు. లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తానని సాల్వే తెలపగా కోర్టు అంగీకరించింది. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను ను ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు తరఫు లాయర్ల అభ్యర్థనతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.