టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరితోపాటు, తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, టీడీపీ నేతలు , కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వైద్యులు చంద్రబాబు సెల్ ను చల్లగా ఉంచాలని సూచించిన తర్వాత ఏసీ ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడం, చివరకు కోర్టు ఆదేశాలతో హుటాహుటిన ఏసీ బిగించే ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇక, చంద్రబాబు ఆరోగ్యం గురించి డీఐజీ కిరణ్ ను లోకేష్ ప్రశ్నించగా…ఆయన దురుసుగా సమాధానమివ్వడం కూడా సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని పవన్ మండిపడ్డారు. చంద్రబాబుకు సరైన వైద్యం అందడంలేదని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని, ఆయన బరువు తగ్గారని చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా ఆయనకు అదనపు సౌకర్యాలు కల్పించాలని వైద్యులు సూచించినా అధికారులు పట్టించుకోవడంలేదని పవన్ విమర్శలు గుప్పించారు. జైళ్ల శాఖ అధికారుల వ్యాఖ్యలు ప్రభుత్వ తీరుకు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని పవన్ డిమాండ్ చేశారు. కోర్టులు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల పూర్తి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు కోరినా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. కక్ష సాధింపు ధోరణితోనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.