ఆయన ఉన్నది టీడీపీ. రెండు సార్లు ఎంపీగా గెలిచింది కూడా టీడీపీ టికెట్‌పైనే. ప్రస్తుతం కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు. అయితే.. మనిషిగా ఆయన టీడీపీలో ఉన్నా.. మనసు మాత్రం వైసీపీలోనే ఉంది. వైసీపీ నాయకులకు ఎలాంటికష్టం వచ్చినా.. నేనున్నానంటూ ఆయన వాలిపోతున్నారు. వారి కష్టాన్ని పంచుకుంటున్నారు. వారితో కలిసి విందులు చేస్తున్నారు. మరి ఈ పరిణామాలను ఎలా అర్ధం చేసుకోవాలి? ఇదీ.. ఇప్పుడు టీడీపీని వేధిస్తున్న ప్రశ్న.
ఆ ఎంపీనే.. తరచుగా వార్తల్లో నిలిచి.. వివాదాలకు కేంద్రంగా ఉన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని. ఆయన పార్లమెంటు సభ్యుడిగా టీడీపీలోనే ఉన్నా.. స్థానిక నేతలతో కానీ.. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలను కలుపుకొని ముందుకు సాగడం కానీ.. ఎక్కడా చేయడం లేదు. అదేసమయంలో ఆయన వైసీపీ నాయకులకు అందుబాటులో ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు.. వారి ఇళ్లకు కూడా తరచుగా వెళ్తున్నారు.
తాజాగా కృష్ణాజిల్లాలోని చెర్లోపల్లిలో వైసీపీ నాయకుడు వాసుదేవనాయుడు ఇంటికి కేశినేని నాని వచ్చారు. ఆయనను పరామర్శించారు. ఇటీవల నాయుడు మాతృమూర్తి మృతిచెందారు. దీంతో ఆయనను నాని పరామర్శించారు. దీనినితప్పుపట్టలేం కానీ.. వైసీపీ నాయకులే.. ఇప్పటి వరకు వాసుదేవనాయుడిని పట్టించుకోలేదు.కానీ, తగుదునమ్మా అంటూ..కేశినేని నాని మాత్రం వెళ్లడమే రాజకీయంగా చర్చకువ స్తోంది. ఇది స్థానికంగా రాజకీయాలను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.
ఇదిలావుంటే.. గతంలోనూ కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలతో విందు భోజనాలు చేయడం గమనార్హం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ను ప్రశంసించడం.. తాను ఆయనతో కలిసికార్యక్రమాలు చేస్తే తప్పేంటని ప్రశ్నించడంతెలిసిందే. ఇక, నందిగామ ఎమ్మెల్యేతోనూ కేశినేని నాని రాసుకుని పూసుకుని తిరుగుతున్నారనేది అందరికీ తెలిసిందే. అదేసమయంలో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలతో నాని విభేదాలు పెట్టుకుని.. విమర్శలు చేస్తుండడం గమనార్హం. మొత్తంగా నాని మనిషిగా టీడీపీలో ఉంటూ.. మనసు మాత్రం వైసీపీపై పెట్టారా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.