జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సామర్లకోట సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. పవన్ పెళ్లిళ్ల, భార్యలపై జగన్ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను పలువురు ప్రతిపక్ష నేతలు, జనసేన నేతలు ఖండించారు. జగన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తటస్థంగా ఉండే వ్యక్తులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ వ్యాఖ్యలపై పవన్ వీరాభిమాని, సినీ నిర్మాత బండ్ల గణేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు దైవ సమానుడైన పవన్ గురించి సీఎం జగన్ అభ్యంతరకంగా మాట్లాడడం సరికాదని అన్నారు.
నిన్నటి నుంచి ఎంతో వేదన అనుభవిస్తున్నానని, ఇప్పటికైనా మాట్లాడకపోతే తన బతుకుపై తనకే చిరాకు కలుగుతోందని బండ్ల చెప్పారు. జగన్ పెద్ద హోదాలో ఉన్నారని, భగవంతుడు అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడని అన్నారు. పవన్ చాలా నిజాయతీపరుడి, నీతిమంతుడని, పరుల కష్టాలు తనవని భావించే భోళా మనిషి అని ప్రశంసించారు. పవన్ జీవితంలో కొన్ని చేదు ఘటనలు ఆయన ప్రమేయం లేకుండానే జరిగాయని పవన్ పెళ్లిళ్ల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఆ విషయం గురించి పదేపదే మాట్లాడటం చాలా బాధకలిగిస్తోందని అన్నారు.