భార్య, భర్త ల బంధంపై సరికొత్త సందేహాలు వ్యక్తమయ్యే ఉదంతాలు ఈ మధ్యన చోటు చేసుకుంటున్నాయి. తాజా ఉదంతం గురించి తెలిస్తే.. నోట మాట రాదంతే. భర్తను కూడా నమ్మలేని పరిస్థితులు వస్తున్నాయా? అన్నదిప్పుడు సందేహాన్ని కలిగించే ఈ ఉదంతంలోకి వెళితే.. బెంగళూరుకు చెందిన యువతీ యువకుడికి గత ఏడాది నవంబరులో పెళ్లైంది.
పెళ్లి తర్వాత హనీమూన్ కోసం థాయిలాండ్ కు వెళ్లారు. అక్కడ భర్తతో సన్నిహితంగా ఉన్న వేళలో రహస్యంగా ఆమెకు సంబంధించిన వీడియోలు తీశాడు శాడిస్టు భర్త. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ వీడియోల్ని భార్యకు చూపించి.. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని.. ప్రతి నెల వచ్చే జీతం మొత్తాన్ని తనకే ఇవ్వాలన్న కొత్త కండీషన్ పెట్టాడు. ఒకవేళ.. తాను చెప్పినట్లుగా చేయకుంటే.. ఆ వీడియోలను.. ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరింపులకు దిగాడు.
పెళ్లికి ముందు.. తనకు సొంతంగా కంపెనీ ఉందని చెప్పిన అతగాడికి వాస్తవానికి కంపెనీ కాదు
కదా.. అసలు ఉద్యోగమే లేదన్న విషయాన్ని తెలుసుకున్న భార్య గుండె బద్దలైంది. దీంతో.. ఆమె బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ ను సాయం కోసం ఆశ్రయించింది. భర్త పెడుతున్న టార్చర్ ను చెప్పుకొచ్చింది. ఈ ఉదంతంలో బాధిత మహిళకు అండగా.. ఆమె తల్లిదండ్రులు నిలిచారు. తమ కుమార్తెను మోసం చేసిన వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.