టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు, జైలు వంటి అంశాలపై ఉద్యమాలను మరింత తీవ్ర తరం చేయనున్నట్టు టీడీపీ ముఖ్య నాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ప్రాంతంలో శనివారం టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ మీటింగ్ సుదీర్ఘంగా జరిగింది. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అరెస్టు, అనంతర పరిణామాలపై చర్చించారు.
అక్రమ అరెస్టుపై ప్రజలను మరింత చైతన్య పరచాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. సమావేశం అనంతరం నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ను కక్ష పూరితంగా అరెస్ట్ చేశారని, ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారని బాలయ్య పేర్కొన్నారు. అయితే, మరింత చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు.
`మేలుకో తెలుగోడా` అనే నినాదంతో మరింత తీవ్ర ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లనున్నట్టు ఆయన చెప్పారు. జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళతాయని తెలిపారు. పవన్ కల్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు టిడిపి మద్దతు ఇస్తుందని బాలయ్య చెప్పారు. ఈ యాత్రకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంపూర్ణంగా పాల్గొంటారని చెప్పారు.
అక్టోబర్ 2 వ తేదీ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని నందమూరి బాలయ్య చెప్పారు. అలాగే శనివారం నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతాయని అన్నారు. రానున్న రోజుల్లో టిడిపి జనసేన కలిసి పోరాడుతాయని.. ఈ విషయంలో ఎలాంటి తేడా రాదని చెప్పారు.