సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రాలో పెట్టబుడులు పెట్టాలంటేనే బహుళజాతి సంస్థలు భయపడుతున్నారని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఆల్రెడీ ఉన్న కంపెనీలు తమ సంస్థను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రాలలో విస్తరిస్తున్న వైనం కూడా చర్చనీయాంశమైంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీ కంపెనీని జగన్ సర్కార్ ఇబ్బంది పెట్టిందని, అందుకే ఆ కంపెనీ విస్తరణ తెలంగాణలో జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇక, తాజాగా అంతర్జాతీయ సంస్థ లులూ కూడా విశాఖ నుంచి హైదరాబాద్ కు తరలిందని, అది కూడా జగన్ నిర్వాకం వల్లేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ‘అమరరాజా టు లూలూ: పెట్టుబడిదారులు ఆంధ్రా నుంచి తెలంగాణకు ఎలా వెళుతున్నారు?’ అంటూ ‘ది ప్రింట్’ ఇంగ్లీష్ మీడియా కథనాన్ని లోకేష్ ట్వీట్ చేశారు. ఉద్యోగాలు సృష్టించే పెట్టుబడిదారులు జగన్ విధ్వంసక నాయత్వంలో సురక్షితంగా లేరని ఆ కథనంలో ఉందని లోకేష్ అన్నారు. అబుదాబికి చెందిన లులూ తో చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని రూ.2,200 కోట్ల పెట్టుబడితో విశాఖలో భారీ హైపర్ మార్కెట్ ఏర్పాటుకు భూమి కూడా కేటాయించింది.
కానీ, జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబుపై కక్షతో లులూ గ్రూప్‌ని కూడా వేధించిందని, అందుకే అది కోయంబత్తూరులో రూ.3,000 కోట్ల పెట్టుబడితో, హైదరాబాద్‌లో కూకట్పల్లి వద్ద రూ.3,500 కోట్లు పెట్టుబడితో అతి భారీ హైపర్ మార్కెట్ ఏర్పాటు చేసిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సెప్టెంబరు 27న హైదరాబాద్ లులూ ప్రారంభం కాగా, జులైలోనే కోయంబత్తూరు లులూ మొదలైంది. ప్రత్యక్షంగా 3,000-4,000 మందికి అందులో ఉద్యోగాలు లభించనుండా..పరోక్షంగా మరో 5-6 వేల మందికి ఉపాధి లభించనుంది.