విశాఖలోని దసపల్లా భూములకు సంబంధించిన వ్యవహారంలో అధికార వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి.. విజయసాయి రెడ్డిల మధ్య నడుస్తున్న అంతర్యుద్ధంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఇష్యూ మీద లేటెస్టు అప్డేట్ అంటూ.. వస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. ఈ భూములు రాణి కమలాదేవికి చెందినవని.. ఆమె వారసులనుంచి కొనుగోలు చేశామన్న ఒక వర్గానికి విజయసాయి మద్దతు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు ఇదే భూములకు సంబంధించి రాణి సాహిబా ఆఫ్ వాద్వాన్ వారసుల పేరుతో బోర్డులు వెలవటం.. వాటికి వైవీ సుబ్బారెడ్డి మద్దతు ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
దీనికి సంబంధించిన పంచాయితీ తాజాగా తాడేపల్లికి చేరినట్లుగా చెబుతున్నారు. ఈ భూముల విలువ రూ.2వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇంతకూ ఈ ఇద్దరి ముఖ్యనేతల మధ్య అసలు పంచాయితీ ఏమిటన్న విషయాన్ని చూస్తే.. ఎంపీ విజయసాయి మద్దతు ఇస్తున్న వర్గానికి చెందిన వ్యక్తి.. నకిలీ డాక్యుమెంట్లతో.. ఫోర్జరీ చేసినట్లుగా చెబుతున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గానికి వైవీ సుబ్బారెడ్డి మద్దతు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఫోర్జరీ కేసులో విజయసాయి అనుచరుడ్ని అరెస్టు చేయాలని వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి తేగా.. అరెస్టు కాకుండా విజయసాయి అడ్డుకున్నట్లుగా చెబుతారు. దీంతో.. ఈ ఇష్యూ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి ముందు విశాఖలోని పెదజాలారి పేట భూముల టీడీఆర్ ఎపిసోడ్ లో కలుగజేసుకోవద్దని వైవీ అండ్ కోకు తాడేపల్లి ప్యాలెస్ చెప్పినట్లుగా చెబుతారు. అయితే.. ఫోర్జరీ సంతకాన్ని అధికారులే తేల్చిన నేపథ్యంలో అరెస్టు చేయాలని తాను చెప్పానని.. ఇలాంటి అక్రమంలోనూ తగ్గి ఉండాలంటే తనకు ఇన్ ఛార్జి పదవి అక్కర్లేదంటూ వైవీ తన వాదనను వినిపించినట్లుగా చెబుతారు.
ఈ కారణంగానే వివాదానికి కారణమైన ఫోర్జరీ సంతకాన్ని తేల్చిన ఉన్నతాధికారిపై బదిలీ వేటు వేసినట్లుగా చెబుతారు. మొత్తంగా దసపల్లా భూముల ఇష్యూలో వైవీ వర్సెస్ విజయసాయి మధ్య పంచాయితీని తెగ్గొట్టే అంశం అంత సులువు కాదన్న మాట వినిపిస్తోంది. తాజాగా ఈ అంశంపై తాడేపల్లి ప్యాలెస్ సీరియస్ గా చూస్తుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.