అనుకున్నంతా అయ్యింది. బీఆర్ఎస్ కు మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. మల్కాజ్ గిరిలో తనకు, మెదక్ ఎంఎల్ఏగా తన కొడుకు రోహిత్ కు టికెట్ ఇవ్వాలని చాలాకాలంగా మైనంపల్లి డిమాండ్ చేస్తున్నారు. అయితే కేసీయార్ మైనంపల్లికి మాత్రమే టికెట్ ప్రకటించారు. కొడుకు రోహిత్ ను పట్టించుకోలేదు. దాంతో పార్టీ నాయకత్వంపై మైనంపల్లి నోటికొచ్చినట్లు మాట్లాడి తిరుగుబాటు చేశారు. దాంతో దాదాపు నెలరోజులుగా మైనంపల్లి ఏమిచేస్తారనే విషయం ఆసక్తిగా మారింది.
మొత్తానికి కొడుక్కి టికెట్ ఇవ్వలేదు కాబట్టి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మైనంపల్లి ఒక వీడియో సందేశాన్ని విడుదలచేశారు. అంతేకాకుండా కొడుకును తీసుకుని వెంటనే ఢిల్లీకి వెళ్ళినట్లు సమాచారం. ఏ పార్టీలో చేరేది తొందరలోనే ప్రకటిస్తానని చెప్పారు కానీ శుక్రవారం రాత్రే కొడుకుతో పాటు ఢిల్లీకి వెళ్ళినట్లు తెలిసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారు.
తండ్రి, కొడుకులకు రెండు టికెట్లు ఇవ్వలేదనే బీఆర్ఎస్ కు మైనంపల్లి రాజీనామా చేశారు. మరి కాంగ్రెస్ లో సాధ్యమవుతుందా అన్నదే కీలకమైన పాయింట్. ఎందుకంటే కాంగ్రెస్ లో కూడా టికెట్లకోసం విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అన్న ప్రచారం పెరిగిపోతున్న కారణంగా టికెట్ల కోసం నేతల ఒత్తిళ్ళు పెంచేస్తున్నారు. ఇక్కడ కూడా ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అనే రాజస్ధాన్ డిక్లరేషన్ అమలు చేయబోతున్నట్లు బాగా ప్రచారంలో ఉంది.
ఈ నేపధ్యంలోనే మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు సాధ్యమవుతుందా అన్నదే అసలైన ప్రశ్న. అధిష్టానం అయితే ఇద్దరికీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చింది కాబట్టే మైనంపల్లి కొడుకుతో పాటు ఢిల్లీకి చేరుకున్నారని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న చాలామంది సీనియర్లకే రెండు టికెట్లు సాధ్యంకాదని చెబుతున్న అధిష్టానం మైనంపల్లి విషయంలో ఏమిచేస్తుందో చూడాలి. పార్టీ వర్గాల ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులకు మాత్రమే రెండు టికెట్లు ఇవ్వబోతోందట. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎప్పటినుండో పోటీచేస్తున్నారు కాబట్టి. అందుకనే మైనంపల్లి ఇష్యు ఇపుడు పార్టీలో ఆసక్తిగా మారింది.