స్కిల్ స్కాం జరిగిందన్న ఆరోపణలతో ఏపీ విపక్ష నేత చంద్రబాబు అరెస్టు కావటం.. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉండటం తెలిసిందే. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఆయనకు మద్దతుగా.. ఆయన అరెస్టును తప్పు పడుతూ జరుగుతున్న నిరసనల్లో కొత్త కోణం బయటకు వచ్చింది. బాబు అరెస్టు వేళ.. ఏపీ ప్రజల నుంచి వచ్చిన స్పందన అంతంత మాత్రంగానే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. టీడీపీ నేతలు సైతం ప్రజల్లో సానుభూతి పెద్దగా రావట్లేదన్న ఆందోళన తమ వ్యక్తిగత సంభాషణల్లో చేసుకుంటున్నారు.
ఇలాంటివేళ.. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చోటు చేసుకుంటున్న ఆందోళనలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మొదట్లో రాత్రి వేళ.. ఐదుగురు ఐటీ ఉద్యోగులు ముఖానికి మాస్కులు కట్టుకొని.. హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ వద్ద నిరసన చేపట్టటం తెలిసిందే. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మొదలైన నిరసనల పర్వం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
బుధవారం ఈ నిరసనలు పీక్స్ కు చేరుకున్నాయి. నగరంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. ఐటీ కారిడార్ లో ఈ నిరసనల జోరు ఎక్కువగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. మగ.. ఆడ అన్న తేడా లేకుండా ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేయటం.. దీనికి వందలాది యువత రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేయటం గమనార్హం. పోలీసులు సైతం ఈ ఆందోళనల్ని అడ్డుకుంటున్నా.. వారు ససేమిరా అనటం.. చివరకు లాఠీ ఛార్జ్ చేసినా వెనక్కి తగ్గకపోవటం చూసినప్పుడు.. ఏపీ కంటే ఐటీ కారిడార్ లో చేస్తున్న నిరసనలే ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
చంద్రబాబు కోసం తాము ఎంతవరకైనా పోరాటతామని.. కుల మతాలు.. రాజకీయాలకు అతీతంగా తాము నిరసన తెలుపుతున్నట్లుగా వారు చెబుతున్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ లో ఐటీ రంగం డెవలప్ అయ్యిందని వారి నోట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. బుధవారం ఉదయం నానర్ రాం గూడలోని విప్రో సర్కిల్ వద్ద ఈ ఆందోళనలు జరిగితే..రాత్రి వేళ కూకట్ పల్లి -జేఎన్ టీయూ మధ్య పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ నిరసనలతో అక్కడి ట్రాఫిక్ పెద్ద ఎత్తున జాం కావటమే కాదు.. ఏపీలోని ఏ ప్రాంతంలోనూ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది లేదన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం. అంతేకాదు.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇక రోజువారీగా నిరసనలు హైదరాబాద్ లో చేపడతామన్న మాట పలువురి నోట వినిపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.