టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే బాలకృష్ణ మకాం వేశారు. మరోవైపు, రాజమండ్రిలో టీడీపీ సీనియర్ నేతలతో లోకేష్ పరిస్థితిపై సమాలోచనలు జరుపుతున్నారు.
అందుబాటులో ఉన్న టీడీపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో బాలకృష్ణ చర్చలు జరిపారు. వారి సలహాలు, సూచనలు తీసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, రాజమండ్రిలో కూడా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప తదితర నేతలతో లోకేష్ భేటీ అయ్యారు. వారి సలహాలు, సూచనలు తీసుకుని ఈ పరిస్థితి నుంచి ఎలా ముందుకు సాగాలి అన్నదానిపై చర్చలు జరిపారు. తాము ఒంటరి కాదని, ప్రజలంతా తమవైపే ఉన్నారని లోకేష్ వారితో చెప్పారు.
చంద్రబాబు విడుదలయ్యే వరకు న్యాయ పోరాటం కొనసాగుతుందని, కోర్టు తీర్పు తర్వాత భవిష్యత్తు కార్య చరణపై నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తామని అన్నారు. ప్రజా పోరాటంలో చంద్రబాబు అరెస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని లోకేష్ అన్నారు. ప్రస్తుతం యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించామని, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత యువగళం తిరిగి ప్రారంభమవుతుందని లోకేష్ చెప్పారు.