స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఆనాడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న పీవీ రమేశ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే చంద్రబాబును తాజాగా సీఐడీ అధికారులు అరెస్టు చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై రమేశ్ స్పందించారు. తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే చంద్రబాబును అరెస్టు చేశారని జరుగుతున్న ప్రచారంపై రమేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ వ్యవహారంలో స్కిల్ డెవలప్ మెంట్ ఎండీ, కార్యదర్శులదే బాధ్యత అని చెప్పారు. కానీ, ఈ కేసులో ఎండీ, కార్యదర్శుల పేర్లు లేవని అన్నారు.
అధికారుల తప్పులు నాయకులకు ఆపాదించడం సరికాదన్నారు. సీఎం స్థాయిలో కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారని, ఏ బ్యాంకు ఎకౌంట్ లో ఏం జరుగుతుందో వారికి తెలియదని చంద్రబాబును సమర్థించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ వివివరాలు, ఫైల్స్ ఎక్కడ అని రమేశ్ ప్రశ్నించారు. వాటిని నిశితంగా పరిశీలిస్తే నిధుల వినియోగం గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. సీఐడీ అధికారుల పనితీరుపై రమేశ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసు గురించి గతంలో సీఐడీకి రమేశ్ లిఖితపూర్వక జవాబిచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్టేట్ మెంట్ ను సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని రమేశ్ తాజాగా ఆరోపిస్తున్నారు.
అయితే, ఈ వ్యవహారంపై సీఐడీ స్పందించింది. కేవలం రమేశ్ స్టేట్మెంట్ ప్రకారమే అరెస్టు చేయలేదని, తమ విచారణలో ఆయన స్టేట్మెంట్ ఒక భాగమని చెబుతోంది.