టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు 2 వారాల జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడలోని ఏసీబీ కోర్టు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా… ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ పిటిషన్ పై విచారణను రేపు మధ్యాహ్నానికి విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు వాయిదా వేశారు. దాంతోపాటు, చంద్రబాబును వారం రోజులపాటు కస్టడీకి కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ విచారణ కూడా రేపు ఏసీబీ కోర్టులో జరిగే అవకాశముంది.
ఈ క్రమంలోనే భారీ భద్రత మధ్య చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. పోలీసుల కాన్వాయ్ నడుమ చంద్రబాబును రాజమండ్రికి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు వెంట ఆయన తనయుడు నారా లోకేష్ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు, వసతి కల్పించాలని జడ్జి హిమబిందు ఆదేశాలు జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించాలని ఆదేశించారు. అంతేకాదు. చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం తెచ్చేందుకు అనుమతినివ్వాలని, ఆయనకు అవసరమైన మందులు, వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.