ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి కొద్దిగా అవగాహన ఉన్న వారికి లగడపాటి రాజగోపాల్ పేరు సుపరిచితమే. కాంగ్రెస్ ఎంపీగా పనిచేసిన రాజగోపాల్ తనదైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో లగడపాటి చేసిన రచ్చ అంతా కాదు. పెప్పర్ స్ప్రే తీసుకొని లోక్ సభలోకి వెళ్లడం, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గందరగోళం సృష్టించడం వంటి పరిణామాలతో లగడపాటి దేశవ్యాప్తంగా అప్పట్లో వైరల్ అయ్యారు. ఏపీ విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న లగడపాటి 2019 ఎన్నికలకు ముందు కొంత యాక్టివ్ అయ్యారు. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి గత ఎన్నికలలో టిడిపి విజయఢంకా మోగిస్తుందని జోస్యం చెప్పారు.
అయితే, ఆ ఫలితాలు ఆయన చెప్పినట్లుగా రాకపోవడంతో ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొంతకాలంగా లగడపాటి పేరు మళ్లీ వినిపిస్తోంది. విజయవాడ లోక్ సభ బరిలో నుంచి టిడిపి తరఫున లగడపాటి బరిలోకి దిగబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లగడపాటి మరి కొద్ది రోజుల్లో సైకిల్ ఎక్కబోతున్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని…టిడిపితో అంటి ముట్టనట్టుగా ఉండటంతో ఆ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. విజయవాడ రాజకీయాలపై లగడపాటికి మంచి పట్టున్న సంగతి తెలిసిందే.
తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అన్న విషయంపై తన అనుచరులతో ఓ సన్నాహాక సమావేశం నిర్వహించాలన్న యోచనలో లగడపాటి ఉన్నారట. ఈ విషయం గురించి మాట్లాడేందుకు బెజవాడలో లగడపాటి అనుచరులు కొద్దిమంది సీక్రెట్ గా భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ నెలాఖరులో లగడపాటి అనుచరుల ఆత్మీయ సమావేశం జరగబోతుందని, ఆ సమావేశంలో లగడపాటి పాల్గొనబోతున్నారని టాక్ వస్తోంది. ఆ సమావేశంలో పొలిటికల్ రీఎంట్రీపై లగడపాటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అనుచరుల కోరిక ప్రకారం లగడపాటి పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.