టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. 118 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారంటూ చంద్రబాబుపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ వ్యవహారం అలా ఉండగానే భీమవరంలో యువగళం పాదయాత్రపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై చంద్రబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని,అసత్య ఆరోపణలు చేస్తున్నారని జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.
రెండ్రోజుల్లో తనను కూడా అరెస్ట్ చేసే అవకాశముందని, దాడి కూడా జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. తనను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. జగన్ అరాచక, విధ్వంసకర పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని జోస్యం చెప్పారు. ఇక, యువగళం పాదయాత్రపై వైసీపీ శ్రేణులే దాడి చేసి..తిరిగి టిడిపి కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతోందని, ప్రజలు గమనించాలని కోరారు. మనవేలితో మన కన్ను పొడిచేలా జగన్ ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు.
జగన్ మామూలు సైకో కాదని కరుడుగట్టిన సైకో అని, జగన్ అరాచక పాలనను తుదముట్టించేందుకు ఇంటికొకరు తనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహాభారతం, రామాయణంలో తుది విజయం ధర్మానిదేనని, కలియుగ రాజకీయంలో టిడిపి కూడా అదే మాదిరిగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో మునుపెన్నడూ రాని రీతిలో టీడీపీకి భారీ మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పారు.