1983 క్రికెట్ ప్రపంచ కప్ ను కపిల్ డెవిల్స్ గెలిచిన తర్వాత భారత్ లో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత కాలగమనంలో క్రికెట్ మన దేశంలో కొందరికి మతంగా మారిందంటే అతిశయోక్తి కాదు. అయితే, 1983లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరోసారి కప్ కొట్టేందుకు దాదాపు 28 ఏళ్లు పట్టింది. 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ ను టీమిండియా కైవసం చేసుకొని భారత క్రికెట్ దేవుడు సచిన్ కు టీమిండియా సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఆ తర్వాత 2015, 2019లో జరిగిన వరల్డ్ కప్ లో భారత్ కు నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అక్టోబరులో జరగబోతోన్న ప్రపంచ కప్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వరల్డ్ కప్ లో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల జట్టును అధికారికంగా వెల్లడించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగనుంది. జట్టుకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
కొంతకాలంగా క్రీడా విశ్లేషకులు ఊహించిన విధంగా జట్టు కూర్పు ఉంది. బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్‌కు, శార్దూల్ ఠాకూర్ కూడా చోటు దక్కించుకున్నారు. కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎంపికయినపప్పటికీ యుజ్వేంద్ర చాహల్‌కు చుక్కెదురైంది. తెలుగోడు, హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ, కీపర్ సంజు శాంసన్, పేసర్ ప్రసిధ్ కృష్ణలకు నిరాశ తప్పలేదు. 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది.
2023 ప్రపంచకప్ నకు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.