సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వంటిదని, దానిని నిషేధించడం కన్నా నిర్మూలించడం సులువని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. స్టాలిన్ వ్యాఖ్యలపై బిజెపి నేతలతో పాటు పలు హిందూ సంఘాలు కూడా నిప్పులు చెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే స్టాలిన్ తలపై అయోధ్యకు చెందిన సాధువు ఒకరు 10 కోట్ల రూపాయల నజరానా ప్రకటించారు. ఒకవేళ ఈ పని చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే తానే ఆ పని చేస్తాను అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి దిలీప్ ఆచారి కూడా..స్టాలిన్ తలపై కోటి రూపాయల నజరానా ప్రకటించారు. స్టాలిన్ దేశద్రోహి అని విమర్శించారు. సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం ప్రతీక అని చారి చెప్పారు. దేశ ప్రజల ఐకమత్యం కోసం బిజెపి తాపత్రయపడుతోందని, ద్రవిడం, సంస్కృతం అంటూ ప్రజల మధ్య విభేదాలను సృష్టించేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ నజరానా వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందించారు. తన తల అంటే ఆ సన్యాసికి ఎందుకు అంత ఇష్టమో తనకు తెలియడం లేదని స్టాలిన్ సెటైర్లు వేశారు. 10 కోట్లు అవసరం లేదని 10 రూపాయలు ఇస్తే తన తల తానే దువ్వుకుంటానని అన్నారు. జాబ్, స్లిట్ అనే పదాలకు తమిళంలో తల దువ్వడం అని అర్థం ఉంది. ఆ అర్ధాన్ని వాడుకున్న స్టాలిన్…ఆ సాధువు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి బెదిరింపులు తనకు, తన కుటుంబానికి కొత్త కాదని, ఆ వ్యాఖ్యలపై వెనక్కు తగ్గేది లేదని అన్నారు. అయినా, సాధువుకు 10 కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు.