వైసీపీ పాలనలో ఫ్యాక్షనిజం పెరిగిపోతోందన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పచ్చగా ఉన్న పల్నాడు ప్రాంతంలో కూడా వైసీపీ శ్రేణులు..టీడీపీ శ్రేణులను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో, బుద్ధా వెంకన్న కారుపై మాచర్లలో దాడి జరిగిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ స్వయంగా చెప్పడం అక్కడి ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా మాచర్లలో మరోసారి టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి జరిగింది. మారణాయుధాలతో వారిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ దాడి ఘటనను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల గురించి చంద్రబాబు ఆరా తీశారు. వారి పరిస్థితి గురించి పల్నాడు జిల్లా టీడీపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆ దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని టీడీపీ నేతలను ఆదేశించారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ గూండాలు గంటల తరబడి మారణహోమం సృష్టిస్తుంటే పోలీసులు నివారించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది పోలీసుల వైఫల్యం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పల్లెల్లో హింసా రాజకీయాలకు పాల్పడుతున్నవైసీపీ కార్యకర్తలు,నేతలకు పోలీసులు మద్దతిస్తున్నారని, అందుకే ఈ తరహా ఘటనలు రిపీట్ అవుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.