ఎస్ ఇప్పుడు టీడీపీలో జరుగుతోన్న అంతర్గత పరిణామాలు చూస్తుంటే నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీ పెనుసంక్షోభం దిశగా పయనిస్తోన్న పరిస్థితే కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బాబు మాటను పార్టీలో సీనియర్లే కాదు జూనియర్లు, యువనేతలు కూడా ఏ మాత్రం లెక్క చేయడం లేదు. మరి కొందరు అయితే లోకేష్‌ను నమ్ముకుంటే మాతో పాటు పార్టీ కూడా నిండా మునిగిపోతుందని ఓపెన్‌గానే బాబుకు చెప్పుతున్నారు. అసలు బాబు ఫామ్‌లో ఉండగా ఆ మాట చెప్పే సాహసం కూడా చేయలేని నేతలు… ఇప్పుడు మీ వారసుడు రాజకీయాలకు పనికిరాడన్నట్టుగా మాట్లాడుతున్నా కిమ్మనలేని పరిస్థితి. దీనిని బట్టే బాబు ఎంత వీక్ అయిపోయారో తెలుస్తోంది.
అందుకే బాబు అధికారంలో ఉన్నప్పుడు నమ్మిన బంట్లుగా ఉన్న నేతలు సైతం పార్టీని వీడాక బాబును ఘోరంగా అవమానిస్తుండడంతో పాటు పచ్చి బూతులే తిడుతున్నారు. తాజాగా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం చాలా మంది పార్టీ నేతలకు నచ్చడం లేదు. ఇది పలాయనవాదం, పిరికితనం అవుతుందని చెపుతున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చావో రేవో పోరాడడం శరణ్యం. పార్టీ కష్టాల్లో ఉందని ఎన్నికలను బహిష్కరించడం అంటే అది పార్టీని చంపేసుకున్నట్టే అవుతుందని పలువురు నేతలు గగ్గోలు పెడుతున్నారు.
పార్టీలో పట్టున్న నేతలు, సీనియర్లు అయితే బాబు మాటను తాము సమర్థించలేమని… తాము తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఎన్నికలను ఎదుర్కొని తీరుతామనే చెపుతున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ దీనిని తప్పు పట్టారు. జ్యోతుల అయితే పార్టీ ఉపాధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. ఇక విజయనగరం ఇన్చార్జ్ ఆదితి గజపతి రాజు తాము ఎన్నికలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఇక మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజక వర్గ నేతలు కూడా ఎదురు తిరగడంతో పాటు ఎన్నికలకు రెడీ అయిపోయారు. ఈ నియెజకవర్గంలో పార్టీ నేతలు అయితే తాము దుగ్గిరాల ఎంపీపీ పదవి గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీ నేతలు బలంగా నిలబడ్డ చోట, కేడర్ గట్టిగా ఉన్న చోట అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నామినేషన్లు ఎలాగూ వేశామని.. ఇప్పుడు తాడోపేడో తేల్చుకోక తప్పదని వాళ్లు తీర్మానాలు చేస్తుండడంతో బాబు మాటకు విలువే లేకుండా పోయినట్లయ్యింది.