ప్రతిపక్ష నేతగా అమరావతి కి జైకొట్టిన జగన్ సీఎం కాగానే మాట మార్చి మూడు రాజధానులంటూ మడమ తిప్పడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి భూసేకరణకు చంద్రబాబు ఎంత కష్టపడ్డా…అదంతా జగన్ పుణ్యమా అని బూడిదలో పోసిన పన్నీరైందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అమరావతి గురించిన సంచలన విషయాలను, అమరావతిపై చంద్రబాబు తపన గురించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ కళ్లకు కట్టినట్లు వెల్లడించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ చెప్పిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. 2014 నుంచి 2016 వరకు తాను ఏపీలో ఐఏఎస్ అధికారిగా పని చేశానని, ఆ సమయంలో అమరావతి కోసం చంద్రబాబుతో పాటు అహర్నిశలు తనతోపాటు ఎందరో ఐఏఎస్ లు, అధికారులు కూడా కష్టపడ్డారని గుర్తు చేసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు చంద్రబాబుతో కలిసి తనతో పాటు మరికొందరు అధికారులు పనిచేసేవారని, మరుసటి రోజు ఉదయాన్నే ఏడు గంటలకు లేచి ఆరోజు ప్రణాళికలు ఏమిటి అని చర్చించుకునే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు.
ఇంత కష్టపడి అమరావతిని రూపుదిద్దేందుకు చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని పక్కనపెట్టి మూడు రాజధానుల ఆలోచన చేయడం రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించిందని పివి రమేష్ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల కోసం డబ్బులు పంచుకుంటూ పోతే ప్రజా జీవితాలు మెరుగుపడవని. ఓటర్లను యంత్రాల్లాగా చూడటం సరికాదని పరోక్షంగా జగన్ ప్రభుత్వానికి చురకలంటించారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ చేపట్టామని, గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని చూశామని అన్నారు.
అయితే, అమరావతి రాజధాని నిర్మాణం ఒక రాత్రిలో సాధ్యం కాదని అన్నారు. అమరావతి నిర్మాణం కోసం సింగపూర్, జపాన్ , చైనా నిపుణులతో చర్చలు జరిపామని, వారు విజయవాడ వచ్చారని గుర్తు చేసుకున్నారు. అమరావతితో పాటు విశాఖ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసేలాగా అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా 13 జాతీయ స్థాయి సంస్థలను ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించి ఘనత చంద్రబాబుదేనని ప్రశంసించారు.