టీటీడీ నూతన చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని, అటువంటి వ్యక్తిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా నియమిస్తారని టీడీపీ, జనసేన, బీజేపీలు నిలదీస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భూమన మతంపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేయడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. తిరుమలలో భూమన క్రైస్తవ డిక్లరేషన్ ఇచ్చినట్లు తమకు తెలిసిందని సోము చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
క్రైస్తవ మతం మీద అభిమానం ఉన్న వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా నియమించడం సరికాదని సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అన్యమతం మీద అభిమానం ఉన్న వ్యక్తులను రెండోసారి టీటీడీ చైర్మన్ గా నియమించడం హర్షించదగ్గ పరిణామం కాదని, దానిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని సోము అన్నారు. మరోవైపు, ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘రైతు గోస-బీజేపీ భరోసా’ సభలో కూడా టీటీడీ వ్యవహారంపై చర్చ జరిగింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న ఈ సభలో తిరుమల పవిత్రతను కాపాడాలంటూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అనే ప్లకార్డులను కొందరు ప్రదర్శించారు. టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకం తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీపీ వైసీపీ మార్చేసిందని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా సభలో ఈ రకంగా తమ నిరసన వ్యక్తం చేశారు.