ఎన్నికలు ఏవైనా కావొచ్చు. పరిస్థితులు ఇంకేమైనా కావొచ్చు. సదరు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి కారులో ఈవీఎం తీసుకెళ్లటానికి మించిన బరితెగింపు ఇంకేం ఉంటుంది? అయితే.. ఇలాంటి వాటిని సైతం బీజేపీ అభ్యర్థులు సమర్థించుకునే తీరుచూస్తే నోట మాట రాదంతే.సంచలనంగా మారింది అసోం ఉదంతంలో చోటుచేసుకున్న పరిణామాల్నిచూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.అసోంలో జరుగుతున్నఅసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం రెండో దశ పోలింగ్ పూర్తి అయ్యింది. కరీంగంజ్ జిల్లాలోని రత్ బాడీ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. ఈవీఎంలను తీసుకొని కారులో వెళుతున్నారు.
అయితే..ఆ కారు బీజేపీ అభ్యర్థికి చెందినది కావటం పెను వివాదంగా మారింది. ఈ ఉదంతం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే.. ఇందులో తమను తప్ప పట్టాల్సిన అవసరం లేదని.. ఎన్నికల అధికారులకు సాయం చేసేందుకే తామీ పని చేసినట్లుగా కమలనాథులు చెబుతున్నారు.ఈవీఎంల్ని తరలించే క్రమంలో.. ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న కారు బ్రేక్ డౌన్ అయ్యిందని.. దీంతో.. ఆ వెనుకనే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారు వెళుతుందని.. దాన్ని ఆపి అందులో ఈవీఎంను తీసుకెళ్లినట్లుగా వివరిస్తున్నారు. అయితే.. ఈ వాదననుపలువురు తీవ్రంగా తప్పు పడతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరూ కూడా.. అధికార పార్టీకి చెందిన కార్లలో ఈవీఎంలను తరలించేందుకు ఇష్టపడరని చెబుతున్నారు.
ఈవీఎంలనుతరలించేందుకు వినియోగించిన వాహనం.. బీజేపీఅభ్యర్థి భార్య పేరు మీద ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వివాదానికి కేంద్రంగా ఉన్నబీజేపీ అభ్యర్థి.. సిట్టింగ్ ఎమ్మెల్యే క్రష్ణేందుపాల్ వాదన మరోలా ఉంది. ఎన్నికల అధికారుల వాహనం చెడిపోయిందని.. మానవతా సాయం చేయాలని తమ కారు ఇచ్చామంటున్నారు. తన కారు మీద బీజేపీ అభ్యర్థి అన్న స్టిక్కర్ కూడా ఉందని చెబుతున్నారు. దాన్ని చూసిన తర్వాత ఈవీఎంలను తరలించేందుకు అధికారులు తమ వాహనాన్ని కోరితే.. ఇవ్వటం తప్పా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి.. ఈ ఇష్యూలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.