గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్సెస్ టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్న రీతిలో కోల్డ్ వార్ కొద్ది నెలలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఎట్టకేలకు యార్లగడ్డ వైసీపీని వీడి టిడిపిలో చేరడంతో ఆ ఎపిసోడ్ కు తెరపడింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరిన రెండు రోజుల్లోనే యార్లగడ్డ వెంకట్రావు… వైసీపీ నేతలపై విమర్శల దాడికి దిగారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని వల్లే గుడివాడలో గతంలో నందమూరి హరికృష్ణ ఓడిపోయారని యార్లగడ్డ షాకింగ్ ఆరోపణలు చేశారు.
కొడాలి నాని పెళ్లికి హరికృష్ణ ఎందుకు హాజరు కాలేదని యార్లగడ్డ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల పేర్లను కొడాలి నాని వాడుకుంటూ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. కొడాలి నాని మాటలు తెలుగు భాషకే అవమానం అని దుయ్యబట్టారు. పార్టీ అధినేత ఆదేశిస్తే గుడివాడలో కొడాలి నాని పై పోటీ చేసేందుకు అయినా తాను సిద్ధమని ప్రకటించారు. గన్నవరం టిడిపికి కంచుకోట వంటిది అని, కొనకళ్ల వంటి నేతలు ఎంపీలుగా గెలవడంలో గన్నవరం నియోజకవర్గానికి కీలకపాత్ర అని యార్లగడ్డ చెప్పారు.
గత ఎన్నికల సందర్భంగా తాను స్వల్ప మెజార్టీతో ఓడిపోయానని, ఆ సమయంలో మంచి పోలీసులు తన నియోజకవర్గంలో ఉండి ఉంటే తాను గెలిచేవాడిని అని యార్లగడ్డ అన్నారు. పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, గన్నవరం నియోజకవర్గాన్ని టిడిపి ఖాతాలో వేసే బాధ్యత తనది అని యార్లగడ్డ ధీమా వ్యక్తం చేశారు. మరి, వెంకట్రావు వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.