వైసీపీ పాలనలో రాష్ట్రంలో భూ దోపిడీలు, కబ్జాలు ఎక్కువైపోయాయని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రుషికొండ వంటి చారిత్రక నేపథ్యం ఉన్న భూములను సైతం వైసీపీ నేతలు వదలడం లేదని, ఇక మామూలు భూముల సంగతి సరే అని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే వైసీపీ నేతల భూధందాలు మాత్రం ఆగడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల విశాఖలో సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్ పై మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వినాశకర పాలన సాగుతోందని, యువతకు భవిష్యత్తు లేకుండా జగన్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై మేధావులు, విజ్ఞులు, ప్రజాసంఘాలు స్పందించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. దోపిడీపై సమర్థవంతులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. విశాఖలో విజయ సాయి రెడ్డి భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు.
ఇప్పటికే విశాఖలో 70 ఎకరాల భూకబ్జాలకు పాల్పడిన ఏ-2 విసారెడ్డి కూతురు నేహారెడ్డికి తర్లువాడ కొండ పై 300 కోట్ల విలువ చేసే 100 ఎకరాల భూమిని నామమాత్ర ధరకు ప్రభుత్వం కట్టబెట్టాలని చూస్తుందని ఆరోపించారు. ఆ కొండపై విష్ణువు పాదాలు, ప్రతిమలు ఉన్నాయి కాబట్టి గుడి కట్టమని స్థానికులుు కోరుతున్నారని చెప్పారు.