నేతలకు సినిమా బెంగ పట్టుకుందా? కీలకమైన ఎన్నికల సమయంలో రాజకీయ పరిణామాలపై వస్తున్న సినిమాల విషయంలో నాయకులు ఒకింత ఆందోళన, ఆవేదనతో ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సినిమా అనేది అత్యంత ప్రభావ వంతమైన దృశ్యమాధ్యమమే కాకుండా.. ప్రజలను ఆలోచింప చేసే శక్తి కూడా ఉంది. అదేసమయంలో నాయకులను ఎన్నుకోవాలా? వద్దా? అనేది కూడా కీలకంగా మార్చేస్తుంది.
2019 ఎన్నికల సమయంలో వచ్చిన యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలు.. వైసీపీకి కలిసి వచ్చాయ నే టాక్ తరచుగా వినిపిస్తుంది. అయితే.. అదేసమయంలో ఎన్టీఆర్ కేంద్రంగా బాలకృష్ణ కూడా సినిమాలు తీశారు. ఇవి టీడీపీకి కలిసివస్తాయని, తిరిగి అదికారం నిలబెడతాయని లెక్కలు వేసుకున్నారు. సరే.. ఇప్పుడు మరోసారి సినిమాల ప్రభావం తెరమీదికి వచ్చింది. అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా.. పెద్ద ఎత్తున ఎన్నికల సినిమాలపై దృష్టి పెట్టాయి.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రామ్గోపాల్ వర్మ వ్యూహం అనే సిని మా తీస్తుంటే.. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా కూడా పొలిటికల్ ఫ్లేవర్లోనే ముందు కు సాగనుందని తెలుస్తోంది. అయితే.. ఆయా సినిమాలు.. పార్టీలు, అధినేతలపై ఎలాంటి ప్రభావం చూపి స్తాయో కానీ.. తమపై మాత్రం ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని ఉమ్మడి జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నాయకులు హడలి పోతున్నారు.
దీంతో ఆయా సినిమాల్లో మార్పులు చేయాలంటూ.. నాయకులు విన్నవిస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్ని కల నాటికి బాలయ్య కూడా టీడీపీకి అనుకూలంగా ఒక సినిమాను రూపొందించే పనిలో బిజీగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ మాటల రచయితగా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి.