విశాఖలోని రుషికొండపై సీఎం జగన్ ఇల్లు, సెక్రటేరియట్ కడుతున్నారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొండపై ఉండటానికి జగన్ ఏమన్నా దేవుడా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోని తాజాగా ఆ వ్యవహారంపై వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. రుషికొండకు గుండు కొట్టించి అక్రమంగా ఇల్లు కట్టుకుంటున్న జగన్ ను దేవుడితో మంత్రులు పోల్చడం ఏంటని రఘురామ ఎద్దేవా చేశారు. టూరిజం కాటేజీల ముసుగులో జగన్ కడుతున్న అక్రమ భవనం సి ఆర్ జెడ్ జోన్ పరిధిలోకి వస్తుందని రఘురామ వెల్లడించారు.
ఆ జోన్ లో నిర్మాణాలకు కొన్ని నిబంధనలు ఉంటాయన్న కనీస అవగాహన వైసిపి నేతలకు, మంత్రులకు లేదని రఘురామ దుయ్యబట్టారు. తిరుమల వెంకన్న ఆలయంతో, శ్రీశైలం కొండపై మల్లికార్జున స్వామి ఆలయంతో, సింహాచలం అప్పన్న ఆలయంతో జగన్ ఇంటిని పోల్చడం ఏమిటని మండిపడ్డారు. ఇలా పోలికలు చేస్తున్న మంత్రులకు మతి భ్రమించినట్టుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇక, రుషికొండపై కట్టిన నాలుగు బ్లాక్ లకు నాలుగు పేర్లు పెట్టారని, వాటిలో సీఎం క్యాంప్ ఆఫీసు, కార్యదర్శుల కార్యాలయాలు, సీఎం నివాస సముదాయం ఉన్నాయని వెల్లడించారు.
కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నారని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ అక్రమ భవనాలను రాబోయే కొత్త ప్రభుత్వం కూల్చివేయాలని సూచించారు. వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి అక్రమ కట్టడాలను కడుతున్నారని ఆరోపించారు. ఒకవేళ అక్కడ తాము కడుతున్నది సీఎం ఇల్లు, సెక్రటేరియట్ కాదు అనే పక్షంలో నిజమెంటో నిరూపించాలని సవాల్ విసిరారు. టూరిజం కార్యకలాపాలకు రుషికొండపై నిర్మించిన నిర్మాణాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. వేరొకరి పేరు మీద 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చి వారి దగ్గర నుంచి జగన్ అద్దెకు తీసుకుంటున్నట్లు నమ్మించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.