వైసీపీ నేతల భూకబ్జాలు, భూధందాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. విశాఖకు కీలకంగా మారిన ఋషికొండపైనే వైసిపి అధినేత జగన్ తో పాటు వైసిపి నేతలు కన్నువేసిన వైనాన్ని పవన్ కళ్యాణ్ ఎండ గట్టారు. ఇక, మంత్రి గుడివాడ అమర్నాథ్ తన ఇలాకా అమలాపురంలోని విస్సన్నపేటలో 600 ఎకరాల భూదోపిడీకి పాల్పడ్డారని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. 13 వేల కోట్ల రూపాయలతో అనుమతులు లేని చోట 600 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా విస్సన్నపేటలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. పవన్ రాక నేపథ్యంలో అమలాపురంలోని విస్సన్నపేటలో సెక్షన్ 30 విధించారు. ఈ క్రమంలోనే విస్సన్నపేట వివాదాస్పద భూములను పరిశీలించిన పవన్ కళ్యాణ్ జగన్ పై మండిపడ్డారు. తనకు మంత్రులతో పనిలేదని, మధ్యలో వచ్చే మంత్రి వ్యాఖ్యలకు స్పందించని అన్నారు. విస్సన్నపేటలో ఈ భూముల వ్యవహారంపై జగన్ స్పందించాలని, మంత్రులు అవినీతికి జగనే బాధ్యుడని పవన్ అన్నారు. ఉత్తరాంధ్ర భూముల దోపిడీకి సమాధానం చెప్పి తీరాలని పవన్ డిమాండ్ చేశారు.
600 ఎకరాల పోరంబోకు, దళితుల భూమి, క్యాచ్మెంట్ ఏరియాలో రియల్ ఎస్టేట్ వెంచర్ ఎలా వేస్తారని పవన్ ప్రశ్నించారు. ఈ దోపిడీకి స్థానిక ఎమ్మెల్యేలు కూడా వత్తాసు పలకడం ఏమిటని మండిపడ్డారు. విస్సన్నపేట గ్రామానికి కనీసం రోడ్డు లేదని, కానీ ఈ వెంచర్లో మాత్రం 100 అడుగుల రోడ్డు, హెలీప్యాడ్ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద భూములపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు ఫిర్యాదు చేస్తానని పవన్ అన్నారు.
అంతకుముందు, తనపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణ నేపథ్యంలో పవన్ కు మంత్రి గుడివాడ అమర్నాథ్ చాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. తనపై పవన్ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తన ప్రెస్ మీట్ కు వచ్చిన విలేకరులందరికీ తలా ఒక ఎకరం పంచి పెడతానని అమర్నాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక, మిగిలిన భూములను జనసేన పార్టీకి రాసి ఇచ్చేస్తానని అమర్నాథ్ చాలెంజ్ చేశారు.