విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ అంటూ 2019 ఎన్నికలకు ముందు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ వర్మ ఆ సినిమాను తెరకెక్కించారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సినిమాలో చంద్రబాబును విలన్ గా చిత్రీకరించి లక్ష్మీపార్వతి పాత్రను వర్మ హైలెట్ చేశారని టిడిపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇక, కొద్ది నెలలుగా వర్మ వైసీపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతున్న క్రమంలోనే 2024 ఎన్నికలే లక్ష్యంగా ‘వ్యూహం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన పరిణామాలు మొదలుకొని తాజా పరిణామాల వరకు ఆ సినిమాలో చూపించబోతున్నానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై ఈ సినిమా షూటింగ్ సందర్భంగా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు పరోక్షంగా జగన్, వైసీపీలకు మద్దతు తెలిపిన వర్మ తాజాగా బహిరంగంగానే తాను జగన్ అభిమానిని అంటూ కుండబద్దలు కొట్టేశారు.
తాను జగన్ అభిమానిని అని, అయితే తనకు ఎవరిపై ద్వేషం లేదని, జగన్ పై తనకున్న అభిప్రాయాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నానని వర్మ అన్నారు. ఈ సినిమా వెనుక నిర్మాత దాసరి కిరణ్ తప్ప మరెవరూ లేరని చెప్పారు. అయితే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పిలిచి అడిగినా వారి సినిమాలకు దర్శకత్వం చేయనని వర్మ తేల్చి చెప్పారు. తాను వైఎస్ భారతి రెడ్డిని దగ్గర నుంచి చూశానని, ఈ సినిమాలో జగన్ తో పాటు భారతి పాత్ర కూడా ఉంటుందని వర్మ క్లారిటీనిచ్చారు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా ఉంటుందని అన్నారు.
ఏపీలో వర్తమాన రాజకీయాలు, అందులో ప్రధాన ఘట్టాలు ఈ సినిమాలో చూపిస్తానని చెప్పుకొచ్చారు. ఇక, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, ఆ హత్య కేసులో నిందితులను ఈ సినిమాలో చూపిస్తామని వర్మ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేశారో తనకు తెలియదన్నారు ఆర్జీవీ. అయితే, ఇచ్చే వాళ్ళుంటే హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పు లేదని, మార్కెట్ ను బట్టి ఆ విషయాలు నిర్మాత చూసుకుంటారని అన్నారు.