జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన గరంగరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్ తో పాటు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ దొంగ అని, విశాఖలో విలువైన భూములను వైసీపీ నేతలు కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ కుట్రలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు బెదిరింపులకు భయపడద్దని, రౌడీలు గూండాలు ఏపీలో రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు.
ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టిలో విశాఖపట్నం ఉందని, దేశభద్రతకు ఈ నగరం అత్యంత కీలకమని వారు భావిస్తున్నారని పవన్ చెప్పారు. అటువంటి విశాఖలో వైసీపీ ఎంపీ సత్యనారాయణ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. తన భార్యను, బిడ్డను, ఆడిటర్ ను కిడ్నాప్ చేస్తే భయపడి హైదరాబాద్ పారిపోతాను అంటున్నాడని దుయ్యబట్టారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉండాల్సిన ఎంపీ ఊరు వదిలి పారిపోతాను అనడం ఏమిటని, అటువంటి భయస్తుడు ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలని నిప్పులు చెరిగారు.
ఎంపీ చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలను బయటకు తెస్తామని మండిపడ్డారు. విశాఖలో సీబీసీఎంసీ భూములు ప్రభుత్వానికి చెందాల్సినవని, ఆ భూమిలో ఎంపీ తన అధికార బలంతో నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. క్రిస్టియన్ భూములను వైసీపీ నేతలు అన్యాయంగా కొట్టేశారని, ఆలయాలు, మసీదులు, చర్చి భూములలో కబ్జా చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ నగర ప్రశాంతతకు వైసిపి నేతలు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రను దోపిడీ చేస్తున్న జగన్ కు పవన్ వార్నింగ్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమాలను, కబ్జాలను బయటకు వెలికి తీస్తామని, అప్పుడు జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోవాలని జగన్ కు వార్నింగ్ ఇచ్చారు.