తిరుమల నడకదారిలో ఆరేళ్ల చిన్నారి లక్షితను చిరుత బలిగొన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. శుక్రవారం రాత్రి తిరుమల కొండపైకి అలిపిరి మార్గం ద్వారా కాలినడకన వస్తున్న సమయంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి అడవిలోకి ఈడ్చుకు వెళ్లింది. శుక్రవారం రాత్రి 7:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శనివారం ఉదయం అలిపిరి నరసింహస్వామి ఆలయం సమీపంలో బాలిక మృతదేహంలో సగభాగం లభించింది. దీంతో, చిన్నారిని చిరుత బలి తీసుకుందని వైద్యులు పోస్టుమార్టం తర్వాత నిర్ధారించుకున్నారు. దీంతో, చిన్నారి లక్షిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు . ఇటువంటి ఘటనలు జరగకుండా టీటీడీ పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. బాలిక మృతి బాధాకరమని, చిరుతను బంధించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. తిరుమల నడకదారిలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, పోలీసులతో పాటు అటవీ శాఖ సిబ్బంది, టీటీడీ సిబ్బంది కలిసి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పారు. నడకదారిలో భక్తులను అనుమతించే సమయాన్ని కుదించే ఆలోచనలో ఉన్నామని అన్నారు.
ప్రతి 40 అడుగులకు భద్రతా సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు, ఈ దాడిలో మృతి చెందిన లక్షిత కుటుంబానికి టీటీడీ 5 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. అటవీశాఖ తరఫునుంచి మరో 5 లక్షల పరిహారం అందించనున్నారు. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన ఘటనా స్థలాన్ని టిటిడి నూతన చైర్మన్ కరుణాకర్ రెడ్డి సందర్శించారు. భక్తులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని,, అధికారులతో సమన్వయం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం చిరుత ఓ బాలుడిని ఈడ్చుకెళ్లబోతుంటే అటవీ శాఖ సిబ్బంది, జనం కలిసి కాపాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ చిరుతను బోనులో బంధించారు.