మెగాస్టార్ చిరంజీవి గొప్పోడని, ఆయన పవన్ కల్యాణ్ లాగా కాదని నిన్నటి వరకు వైసీపీ నేతలు ప్రశంసించిన సంగతి తెలిసిందే. పవన్ ను తూర్పారబడుతున్న అధికార పార్టీ నేతలు…చిరుపై ఈగ కూడా వాలనివ్వలేదు. అదంతా నిన్నటి దాకా. నిన్న రాత్రి పరోక్షంగా ప్రభుత్వంపై చిరు చేసిన కామెంట్లతో సీన్ మారిపోయింది. సినిమాలపై కాకుండా డెవలప్ మెంట్ పై ఫోకస్ చేస్తే బాగుంటుంది అని చిరు చేసిన సద్విమర్శతో వైసీపీ నేతలకు చిరు కూడా చెడ్డవాడైపోయాడు. ఇంకేముంది, చిరంజీవిపై కూడా తాజాగా వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడం మొదలుబెట్టారు. చిరు వ్యాఖ్యలకు బూతుల మంత్రి అని ప్రతిపక్షాలు విమర్శించే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
టాలీవుడ్ లో ఎంతోమంది పకోడీగాళ్లున్నారని, ప్రభుత్వం ఎలా నడపాలో వారు సలహాలిస్తున్నారని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం గురించి మనకెందుకులే అని వాళ్లకు కూడా సలహాలివ్వాలని చిరుకు చురకలంటించారు. డ్యాన్సులు, ఫైట్లు, యాక్షన్ గురించి చూసుకుందాం, ప్రభుత్వ వ్యవహారాలు మనకెందుకు అని ఆ ఆ ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని కొడాలి నాని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై, పవన్ పై కూడా నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు.
జనసేన కామెడీ పార్టీ అని, జన సున్నా పార్టీ అని. చంద్రబాబు సేవకే పవన్ పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు. పవన్ మాటలు కోటలు దాటతాయని, కానీ, రెండు చోట్ల పోటీ చేసి నాలుగు చోట్ల ఓడిపోగల సత్తా పవన్ కు ఉందని సెటైర్లు వేశారు. వాడిని కొడతా వీడిని కొడతా, గుండు గీయిస్తా అన్న పవన్ కు ఎప్పుడో గుండు కొట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పవన్ ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టారని, బాబును సీఎం చేయడం పవన్ వల్ల కాదని అన్నారు.