ఈ సారి ఏపీ ఎన్నికల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా సాగుతున్న పవన్.. అందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి విమర్శలు, ఆరోపణలు వచ్చే కంటే ముందే పవన్ తగిన చర్యలు తీసుకుని ఆ అవకాశమే ఇవ్వకుండా చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సీట్ల కేటాయింపు విషయంపై పవన్ బహిరంగ ప్రకటన చేయడమే అందుకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
వారాహి యాత్రతో పవన్ జోరుమీదున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఆయన యాత్ర విజయవంతం కావడం పార్టీలోనూ, శ్రేణుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. ఇదే దూకుడు కొనసాగించేందుకు పవన్ మూడో దశ వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ సారి ఉత్తరాంధ్రపై కన్నేశారు. దీంతో పవన్ను కట్టడి చేసేందుకు వైసీపీ విమర్శలతో సిద్ధమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెళ్లిల్ల విషయంపై పవన్ వైసీపీకి గట్టిగా సమాధానమిచ్చారు. ఇక ఇప్పుడు కొత్త విషయంపై వైసీపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రజారాజ్యం తరహాలో పవన్ టికెట్లు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారానికి తెరలేపేందుకు వైసీపీ సిద్ధమవుతుందని టాక్. ఈ విషయం పవన్ వరకూ వెళ్లడంతో ప్రత్యర్థికి ఆ అవకాశమే ఇవ్వకుండా కౌంటర్ అటాక్ చేయాలని భావించారు. ఈ సారి అనుభవజ్ఞులు, రాజకీయ అవగాహన ఎక్కువగా ఉన్న వాళ్లకు టికెట్లు ఇచ్చేందుకు పవన్ సిద్ధమయ్యారు. దీంతో పవన్ టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించేందుకు వైసీపీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పవన్.. తన పార్టీలో టికెట్లు, పదవుల విషయంలో పారదర్శకత పాటిస్తామని, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో వైసీపీకి విమర్శించే అవకాశమే లేకుండా చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.