వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో జరగనున్న ఎన్నికల తర్వాత రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వం ఉండడం లేదని చెప్పారు. ప్రభుత్వం ఖచ్చితంగా మారుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అప్పుడు రైతుల సమస్యలను తామే స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తామని పవన్ చెప్పారు. ఉమ్మడి కృష్నాజిల్లాలోని మల్లవల్లి గ్రామంలో ఆయన పర్యటిం చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు.. వివిధ ప్రాజెక్టుల కోసం తమ పొలాలను తీసుకుని కూడా..పరిహారం ఇవ్వడం లేదని .. అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “మల్లవల్లి రైతులకు మాట ఇస్తున్నా. మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. కృష్ణా జిల్లా రెవెన్యూ వారికి కూడా చెబుతున్నాం.. మంత్రి వర్గం తప్పులు చేస్తే.. వాటిని మీరు వెనకేసుకురావద్దు. నాయకుల కోసం చట్టాలను అతిక్రమిస్తే.. కొత్త ప్రభుత్వం వచ్చాక.. మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే మీ అందరికీ చెబుతున్నా.. 2024లో ప్రభుత్వం మారబోతోంది. వైసీపీ ప్రభుత్వం ఉండట్లేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక.. మల్లవల్లి రైతుల సమస్యపై నేను ప్రత్యేక శ్రద్ధ పెడతాను“ అని పవన్ వ్యాఖ్యానించారు.
మరో 9 నెలలు ఆగండి!
రైతులు మరో 9 నెలుల ఓపికగా ఉండాలని.. పవన్ కళ్యాణ్ సూచించారు. సమస్యలపై పోరాటం విషయంలో రైతులు ఐక్యంగా ఉండాలన్నారు. లేకపోతే.. అనేక సమస్యలు వస్తాయని.. కొత్త ప్రభుత్వం వచ్చాక మల్లవల్లి రైతుల సమస్యలపై దృష్టి సారిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. రైతులపై దాడి చేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ అవసరాలకు ప్రజల నుంచి భూములు తీసుకోవచ్చు.. వాటికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని పవన్ కల్యాణ్ అన్నారు.
టీడీపీ, బీజేపీ కూడా స్పందించాలి
రైతుల సమస్యలపై టీడీపీ, బీజేపీలుకూడా స్పందించాలని పవన్ సూచించారు. రైతుల ఇళ్లలోకి పోలీసులు చొరబడితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని మండిపడ్డారు. 2016లో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి.. మల్లవల్లి రైతులకు ఆ పార్టీ నేతలు అండగా ఉండి పరిహారం ఇప్పించాలన్నారు.