టీడీపీ అధినేత చంద్రబాబు… పార్టీ ప్రకటించిన `సీమ డిక్లరేషన్` అంశంపై ప్రజలను చైతన్య పరిచే ఉద్దేశంతో సీమలో పర్యటిస్తు న్నారు. రైతులు, ఇతర వ్యవసాయ వర్గాలవారితో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత కర్నూలులో పర్యటించిన చంద్రబాబు.. ఈ రోజు ఏపీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కడప జిల్లాలోని పులివెందులలోనూ పర్యటించారు. అయితే.. ఈ క్రమంలో వైసీపీలోని కొందరు కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
పులివెందులలో చంద్రబాబు చేపట్టే రోడ్ షో ప్రాంతాలైన పూల అంగళ్లు, నాలుగు రోడ్ల జంక్షన్ వంటి ప్రాంతాల్లో కార్లలో వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. వైసీపీ జెండాలను గాలిలోకి ఊపుతూ.. టీడీపీ నేతలపై దూషణలకు దిగారు. నిజానికి స్థానిక ప్రజల నుంచి ఎలాంటి నిరసన లేకపోయినా.. వైసీపీ కార్యకర్తలు, నాయకులు కొందరు రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శించారు. వాస్తవానికి సీఎం జగన్ ఇలాకా కావడంతో టీడీపీ కూడా చాలా అప్రమత్తంగా నే వ్యవహరించింది. ఎక్కడా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాలని..చంద్రబాబు పదేపదే ఇక్కడి నాయకులకు సూచించారు.
దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా.. రెండు రోజుల నుంచి ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రశాంత వాతావరణం లో, శాంతియుతంగా చంద్రబాబు రోడ్ షో, అనంతరం సభలు నిర్వహించేలా వ్యవహరించారు. కానీ, బుధవారం సాయంత్రం 6 గంటలకు చంద్రబాబు వస్తారనగా.. మధ్యాహ్నం 4 గంటల సమయంలో అనూహ్యంగా ఓ వర్గం నేతలు.. కార్లలో వచ్చి.. టీడీపీ నేతలను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. గాలిలో వైసీపీ జెండాలు ఊపుతూ.. దూషిస్తూ.. రెచ్చగొట్టే వ్యవహారానికి దిగారు. దీనిని గమనించిన టీడీపీ సీనియర్ నాయకులు.. శాంతి యుత పంథాలోనే వారిని అక్కడ నుంచి తరిమి కొట్టారు. దీంతో చంద్రబాబు పర్యటనను భగ్నం చేయాలని అనుకున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులే అక్కడ నుంచి ఉడాయించారు.