టీడీపీలో ఒక విషయం చాలా సీక్రెట్‌గా ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న టీడీపీ.. అభ్యర్థుల ఎంపిక ప్రారంభించింది. ముఖ్యంగా సీమ ప్రాంతంలో ఈ సారి.. 50శాతం సీట్లను గెలుచుకోవాలని పార్టీ అధినేత నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు.. నేతలను కూడా రెడీ చేసుకున్నారు. ఈ క్రమంలో మిగిలిన నియోజకవర్గాలనూ బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈసారి టికెట్ల ఎంపికలో ఎలాంటి మొహమాటాలకు తావుండదని, గెలిచే అభ్యర్థులకే టికెట్లు అంటూ పార్టీ అధినేత చంద్రబాబు, యువ నాయకుడు నారా లోకేష్ వరకు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే తామైతే.. అంతో ఇంతో మొహమాటానికి గురి కావాల్సి ఉంటుందని భావించిన చంద్రబాబు.. అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కూడా రాబిన్‌శర్మ టీంకు అప్పగించారని తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారని అంటున్నారు. ఏయే అభ్యర్థికి జనాల్లో సానుకూలత ఉందో తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పులివెందుల అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ప్రకటించారు. జమ్మలమడుగు అభ్యర్థిగా భూపేశ్‌రెడ్డి పేరు ఖరారైంది. ఇక ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం సర్వే జరుగుతోంది. దసరా నాటికి అభ్యర్థులను ప్రకటిం చాలని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తోంది. తొలుత ఎస్సీ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు చెబుతున్నారు. తరువాత మైనార్టీల అభ్యర్థులను ఆ తరువాత మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తామని చెబుతున్నారు.
ఒక్కొక్క నియోజకవర్గంలో ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులపై సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఆశించేవారి సంఖ్య ఎక్కువ కావడంతో గెలుపు గుర్రాల కోసమే సర్వే చేస్తున్నారు. గెలుపు గుర్రాల ఎంపికలో ఎలాంటి మొహమాటం లేకుండా టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు చెబుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనే వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా చంద్రబాబు వ్యూహానికి పదను పెడుతున్నారు. ఇక టికెట్ల కోసం ఎందరో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సర్వేలో తేలిన వారికే టికెట్లు ఇస్తామని అధిష్టానం చెబుతోంది. అయితే.. ఇవన్నీ కూడా అత్యంత రహస్యంగా జరుగుతుండడం గమనార్హం.