టాలీవుడ్లో కొన్ని దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగాా ఒక వెలుగు వెలిగాడు మెగాస్టార్ చిరంజీవి. అప్పటిదాకా ఉన్న సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టి.. తనకు తానే సాటి అనిపిస్తూ ఆయన అందుకున్న విజయాలు ఒక చరిత్ర. 2007లో రాజకీయాల కోసం సినిమాలకు దూరం అయ్యేవరకు ఒక మూడు దశాబ్దాల పాటు ఆయన టాలీవుడ్‌కు మకుటం లేని మహారాజు.
పదేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చే సమయానికి కథ మారిపోయింది. ఆయన్ని మించి కొందరు హీరోలు ఎదిగిపోయారు. ప్రభాస్ లాంటి వాళ్లు పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్ సంపాదించుకున్నారు. కానీ ఇంత పోటీలోనూ యువతరంతో పోటీ పడుతూ మెగాస్టార్ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో మెగా హిట్ కొట్టి యంగ్ హీరోలకు తానేమీ తీసిపోనని చాటారు. త్వరలోనే ఆయన ‘భోళా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాకు మరీ హైప్ లేకపోయినా అభిమానుల్లో ఉత్సాహం మాత్రం తక్కువగా లేదు. సినిమా విడుదలకు రెండు వారాల ముందే మెగా ఫ్యాన్స్ హడావుడి మొదలైపోయింది. తెలంగాణలోని సూర్యాపేటలో చిరు కోసం ఒక భారీ కటౌట్ సిద్ధమైపోయింది. దాని ఎత్తు వంద అడుగులు పైనేనట.
టాలీవుడ్లో ఒక హీరోకు పెట్టిన అతి పెద్ద కటౌట్ ఇదేనట. విశేషం ఏంటంటే.. ఈ కటౌట్ థియేటర్ దగ్గర పెట్టింది కాదు. రాజు గారి తోట అనే ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి ఈ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఆ ప్రాంతంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
చిరు చాలా స్టైలిష్‌గా ఉన్న ఫొటోతో ఉన్న కటౌట్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 67 ఏళ్ల వయసులోనూ చిరు ఇంకా అభిమానుల్లో ఇంతటి జోష్ నింపుతుండటం, ఇలాంటి ఫాలోయింగ్ కలిగి ఉండటం విశేషమే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే.