పల్నాడు ప్రాంతం గురించి ఏపీ ప్రజలకు పరిచయం అక్కరలేదు. రాయలసీమ తర్వాత రాష్ట్రంలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా దీనికి గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు రాజ్యమేలాయి. అయితే, టీడీపీ హయాంలో ఫ్యాక్షన్ హత్యలు, కొట్లాటలు, గొడవలు లేకుండా చంద్రబాబు నివారించగలిగారు. కానీ, గత నాలుగేళ్లుగా వైసీపీ హయాంలో పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రక్కసి మరోసారి కోరలు విప్పింది.
ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు…ప్రతిపక్ష నేతలపై ఫ్యాక్షన్ తరహా దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వినుకొండలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన గొడవ…చివరకు రాళ్లదాడి వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే వినుకొండ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఈ రోజు ఉదయం ర్యాలీ నిర్వహించాయి. అయితే, ర్యాలీలో పాల్గొన్న టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసులు పెట్టారు. దీంతో, తమపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి. అయితే, అదే సమయంలో టీడీపీ శ్రేణులకు పోటీగా వైసీపీ శ్రేణులు కూడా భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నాయి. దీంతో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
గొడవ ముదిరి ఒకరిపై మరొకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. ఈ దాడిలో 15 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. వినుకొండలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మరోసారి గొడవ జరిగే అవకాశముండడంతో వినుకొండకు అదనపు బలగాలను తరలించాలని ఉన్నతాధికారులను స్థానిక పోలీసులు కోరారు. ఈ క్రమంలోనే ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు వినుకొండలో 144 సెక్షన్ విధించారు.