జగన్ పై కామ్రెడ్ నారాయణ నిప్పులు చెరిగారు. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన సీపీఐ కురువృద్ధుడు నారాయణ ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. పవన్‌ను మానసికంగా సీఎం జగన్ టార్గెట్ చేస్తున్నారని, ఆయన వ్యక్తిగత విషయాలను ఆయన రోడ్డుకు లాగుతున్నారని.. జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా కామ్రెడ్ నారాయణ కూడా సంచలన వ్యాఖ్యలుచేశారు. “మూడు పెళ్లిళ్లు నేరమా.. బాబాయిని చంపడం నేరమా?“ అని ఆయన నేరుగా.. ఘాటుగా ప్రశ్నించారు. తాజాగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ప్రమాదమా? ఇంట్లో బాబాయిని చంపితే ప్రమాదమా? అని పరోక్షంగా ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యను ప్రస్తావించారు. బాబాయిని చంపడం నేరం కాదని చెబుతారా? అని నిలదీశారు.
“ఆయన విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటే జగన్‌కు ఎందుకు. అయినా.. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నా.. ముప్పై పెళ్లిళ్లు చేసుకున్నా.. ఈ రాష్ట్రానికి, దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు. హత్యలు జరిగితేనే ఈ రాష్ట్రానికి నష్టం“ అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తన స్థాయిని మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాజకీయ పరమైన అంశాలతో ఎవరినైనా విమర్శించొచ్చు కానీ, తరచూ వ్యక్తిగత దూషణలతో నిందలు వేయడం ఏంటని మండిపడ్డారు. రాజకీయంగా పస లేనందువల్లే.. పవన్‌ను ఏమీ చేయలేక.. ఇలా వ్యక్తిగత విషయాలపై జగన్ విమర్శలు గుప్పిస్తూ.. ముఖ్యమంత్రి పీఠానికే కళంకం తెస్తున్నారని కామ్రెడ్ బ్రో మండిపడ్డారు.