ఏపీ రాజధాని అమరావతి విషయంలో అధికార పార్టీ వైసీపీ యూటర్న్ తీసుకుందా ? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ప్రజల సెంటిమెంటును దృష్టిలో పెట్టుకుందా? అంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో ఔననే అంటున్నారు పరిశీలకులు. గత 2020 నుంచి కూడా అమరావతి పేరు ఎత్తని సీఎం జగన్.. తాజాగా ఈ అమరావతి మన అందరిదీ! అని కామెంట్ చేశారు. నిజానికి ఇక్కడి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పు డు.. ఆయన ఈమాట చెప్పలేదు. పైగా రెచ్చగొట్టేలా మంత్రులు వ్యాఖ్యలు చేశారు.
కానీ, మూడు రాజధానుల విషయం ముడిపడకపోవడం.. కేసులు తేలకపోవడం.. సుప్రీంకోర్టులో వాయిదా ల పర్వం కొనసాగుతుండడంతో ప్రతిపక్షాలు అమరావతి అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఎన్నికల్లో బలమైన పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా వైసీపీ యూటర్న్ తీసుకుందనే భావన వ్యక్తమవుతోంది. విశాఖను రాజధానిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించు కుంది. వచ్చే సెప్టెంబరులో వినాయకచవితి తర్వాత..అ క్కడకు సీఎం వెళ్లిపోవాలని కూడా నిర్ణయించు కున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే.. సుప్రీంకోర్టులో కేసు ఇప్పట్లో తేలక పోయేసరికి.. ఈ ప్రతిపాదనను కూడా విరమించుకున్నారు. దీనికితోడు విశాఖలోనూ ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో సర్కారు వెనుకడుగు వేసిందని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. అమరావతి సెంటిమెంటు మాత్రం చల్లారలేదు. ఇది ఎన్నికల నాటికి మరింత బలంగామారుతుందనే సంకేతాలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే నిన్నమొన్నటి వరకు అమరావతి పేరును కూడా ఎత్తని సీఎం జగన్.. అనూహ్యంగా ఈ పేరు ఎత్తారు.
అమరావతిలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఆయన .. ఆ వెంటనే అమరావతి అందరిదీ అనడం వెనుక వచ్చే ఎన్నికల వ్యూహం దాగి ఉందని.. అమరావతి సెంటిమెంటుకు తాము వ్యతిరకం కాదని ఆయన చెప్పడమే దీని వెనుక మర్మమని మెజారిటీ అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. తాము రాజధానికి వ్యతిరేకం కాదని.. ఓ వర్గానికి మాత్రమే వ్యతిరేకమని.. చెప్పడం ద్వారా.. అమరావతి సెంటిమెంటు తమకు యాంటీ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇది మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.