తనపై కొందరు చేసిన తప్పుడు ఆరోపణలు, వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళగిరి కోర్టుకు వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేష్ నేడు మంగళగిరి వచ్చారు. పాదయాత్రకు రెండు రోజుల విరామం ప్రకటించిన లోకేష్…కోర్టుకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పై, వైసీపీ నేతలపై లోకేష్ విమర్శలు గుప్పించారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే తనను టార్గెట్ చేశారని, విదేశాల్లో తన చదువుకైన ఖర్చును తన కుటుంబ సభ్యులు భరించారని అసెంబ్లీలో ఆధారాలతో సహా నిరూపించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. తనకు రెండో పెళ్లయిందని, ఫొటోలను మార్ఫింగ్ చేసి తనపై దుష్ప్రచారం చేశారని అన్నారు. తెలుగులో ఒక్క పదం అటు ఇటు తూలినా తనను విపరీతంగా ట్రోల్ చేశారని, వ్యక్తిగతంగా అవమానించారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి తనపై వైసీపీ ఆరోపణలు చేయడం మొదలుబెట్టిందని అన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతికి తానే కారణం అన్నారని, వెంకటేశ్వరస్వామి నుంచి పింక్ డైమండ్ స్వాహా చేశామని ఆరోపించారని దుయ్యబట్టారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, అందులో తాను భారీగా భూములు కొన్నానని ప్రచారం చేశారని, ఫైబర్ గ్రిడ్ లో కూడా భారీ అవినీతి జరిగిందని, అందుకు కూడా లోకేష్ కారణమని చెప్పారని గుర్తు చేశారు. 2019 ఓటమి తర్వాత కూడా తనపై తప్పుడు ప్రచారం కొనసాగిందని అన్నారు.
ఇకపై ఏ మీడియా చానల్ కానీ, పత్రిక కానీ తనపై తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు రాతులు రాసినా… వైసీపీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేసినా…అటువంటి వారందరిపై పరువునష్టం కేసు వేస్తానని హెచ్చరించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో రూ.25 లక్షల విలువైన భోజనం చేశానని సాక్షి, డెక్కన్ క్రానికల్, ది వీక్ పత్రికల్లో రాశారని, ఆ మూడు పత్రికలపై పరువునష్టం దావా వేశానని గుర్తు చేశారు. అసలు ఆ రోజుల్లో తాను వైజాగ్ లోనే లేనని ఆధారాలతో సహా బయటపెట్టానని చెప్పారు.
తన పిన్నితో తనకు ఆస్తి గొడవలున్నాయని, పిన్ని మా ఇంటికి వస్తే నేను దాడి చేశానని, దూషించానని దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆరోపించాడని చెప్పారు. దేవేందర్ రెడ్డిపైనా రూ.50 కోట్లకు క్రిమినల్ దావా వేశానని, అందులో భాగంగానే ఇవాళ మంగళగిరి కోర్టుకు హాజరయ్యానని చెప్పారు.