మనుషులు మృగాల్లా వ్యవహరిస్తున్నారనడానికి మధ్యప్రదేశ్‌లో వెలుగు చూస్తున్న ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిన్నటికి నిన్న ఓ ఆదివాసీ యువకుడిపై అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి మూత్రవిసర్జనకు పాల్పడిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హుటాహుటిన స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్.. వెంటనే ఆ నిందితుడి ఇంటిని బుల్ డోజర్‌తో కూల్చేయడం తెలిసిందే. అంతేకాదు.. బాధితుడి కాళ్లు కడిగి బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు. ఇక, ఇప్పుడు ఇదే మధ్యప్రదేశ్ లో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు.. కదిలే కారులో అతడిని చితకబాదారు. అంతటితో ఆగకుండా అతడితో బలవంతంగా తమ పాదాలు నాకించి, చెప్పులతో కొట్టి వికృతంగా ప్రవర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ యువకుడిని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్న కొందరు.. మార్గమధ్యంలో అతడిపై దాడికి పాల్పడినట్లు గా కనిపిస్తోంది. చెప్పులతో అతడి ముఖంపై తీవ్రంగా కొడుతూ.. బండబూతులు తిట్టారు. ఆ తర్వాత ఇద్దరు యువకులు అతడితో బలవంతంగా తమ పాదాలను నాకించారు.
ఈ వ్యవహారాన్ని కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో కాస్తా వివాదాస్పదంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గత శుక్రవారం చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడు, నిందితులందరూ గ్వాలియర్ జిల్లాలోని దబ్రా ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే, నిందితులు ఆ యువకుడిపై ఎందుకు దాడి చేశారనేది మాత్రం తెలియాల్సి ఉంది.