ఉమ్మడి కృష్ణాజిల్లా.. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ దూకుడు కనిపిస్తోంది. పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. కేడర్‌ను బలోపేతం చేసు కునే దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయమని ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో పార్టీలో పనిచేసి.. తర్వాత దూరమైన నాయకులను ఆయన తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నారు.
దీంతో పార్టీ పరుగులు పెట్టడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా వేంపాడు మేజర్ డీసీ మాజీ మాజీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు దంపతులను పార్టీలోకి చేర్చుకున్నారు. సుమారు 100 మంది కార్యక ర్తలతో తరలి వచ్చిన తుమ్మల దంపతులు.. ముద్దరబోయిన ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. 2019 వరకు పార్టీలోనే ఉన్న తుమ్మల దంపతులు.. స్థానికంగా బలమైన వర్గంగా పేరు తెచ్చుకున్నారు. వేల్పుచర్ల, వేంపాడు తదితర గ్రామాలపై రాజకీయంగా పట్టున్న నాయకులుగా పేరుంది.
అయితే.. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత.. వారు పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొన్నాళ్లు బీజేపీలో ఉన్నారు. అయితే.. ఇటీవల కాలంలో ఆ పార్టీలో వారికి ప్రాధాన్యం దక్కడం లేదని భావించి బయటకు వచ్చారు. దీంతో ముద్దరబోయిన వారితో చర్చించి.. తిరిగి సైకిల్ ఎక్కేలా చేశారు. వీరి రాకతో.. పార్టీ స్థానికంగా బలోపేతం అవుతున్నారు. సుమారు 10 గ్రామాల పరిధిలో వారి ప్రభావం ఉంటుందని ముద్దరబోయిన లెక్కలు వేసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో విజయం దక్కించుకునేందుకు అందరూ కలిసి మెలిసి పని చేస్తామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇక, తుమ్మల కుటుంబానికి కూడా.. రాజకీయంగా మంచి పేరుంది. దీంతో ఈ కుటుంబం రాక.. టీడీపీకి దన్నుగా మారుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే.. నూజివీడు నియోజకవర్గం అభ్యర్థిపై చంద్రబాబు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.